Wednesday, September 30, 2015

Short notes on" తెలంగాణా చరిత్ర - సాహిత్యం "

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన సిలబస్ లో తెలంగాణ భాషా సాహిత్యాలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. జనరల్ స్టడీస్ భాగంగా కూడా తెలంగాణ సాహిత్యం ఉంది. ఇందుకోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసే ప్రతి అభ్యర్థికి తప్పని సరిగా తెలంగాణ సాహిత్యంపై పరిజ్నానం ఉండాలి. ఈ సారి పరీక్షలు ఎప్పటిలా కాకుండా అభ్యర్థుల అవగాహనను పరిశీలించేలా ఉంటాయని కమిషన్ చైర్మెన్ పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఏదో మొక్కుబడిగా కాకుండా కాస్త పరిశీలాత్మకంగానే సాహిత్యం చదవాల్సి ఉంటుంది. ఇందుకోసం కాలానుగుణంగా అభ్యర్థులు ద్రుష్టి సారించాల్సిన అంశాలపై  ఈ వ్యాసం అవగాహన కల్పిస్తుంది.

***శాతవాహన యుగం***
శాతవాహనులు సుమారు నాలుగన్నర శతాబ్దాలు పాలించారు. వీరి కాలంలో ప్రాక్రత భాష అధికారిక భాషగా ప్రముఖస్థానాన్ని వహించింది.  ఈ భాషలోనే వీరి శాసనాలు ఉన్నాయి. హాలుడు ప్రాక్రుత భాషలో గొప్పకవి. ‘గాథాసప్తశతి’ గ్రంథాన్ని సంకలనం చేశాడు. ఈ గ్రంథాన్ని బాణభట్టుడు ప్రశంసించాడు. ఇందులో అమ్మ. అత్తా, రుంప (రంపం) వంటి అనేక దేశీ పదాలు ఉన్నాయి. గుణాఢ్యుడు ‘బ్రుహత్కథ’ ను పైశాచీ ప్రాక్రుతంలో రచించాడు. ఇది తెలుగులో వెలిసిన తొలి కథాకావ్యం. శాతవాహనులు బ్రాహ్మణ మతానికి ప్రధాన్యం ఇచ్చారు. దాంతో  క్రమంగా ప్రాక్రుత భాషా స్థానంలో సంస్క్రుత భాష రాజాస్థానంలో ప్రాచుర్యం పొందింది. శర్మవర్మ కాతంత్ర వ్యాకరణాన్ని రచించి సంస్క్రుతాన్ని అభ్యసించడం సులభతరం చేశాడు. బౌద్ధులు కూడా ప్రాక్రుత భాషనే అనుసరించారు. జైనులు అర్థమాగధి అనే ఒక రకమైన ప్రాక్రుతాన్ని అనుసరించారు.
శాతావాహనంతర యుగం
శాతవాహనుల తర్వాత 12వ శతాబ్దం వరకు తెలంగాణలో ఎన్నో రాజ్యాలు వెలిసి పతనమయ్యాయి. కొన్ని ఇతర ప్రాంత రాజ్యాలు కూడా కొన్నాళ్లు తెలంగాణాను పరిపాలించాయి. ఈ కాలంలో సాహిత్యపరంగా నామమాత్రమైన అభివ్రుద్ధి కనిపిస్తోంది. నాటి కవి పంప ‘ఆదిపురాణం’ రంచించాడు. తనను ఆదరించిన చాళుక్యరాజు అరికేశరి -2 జీవితగాథను ‘విక్రమార్జున విజయము’ పేరుతో రాశాడు. ఈ రెండూ కూడా కన్నడ భాషలో రచించాడు. వేములవాడ చాళుక్యుల కాలంలో ఉన్న సోమదేవసూరి సంస్క్రుతంలో ‘యశస్తిలక చంపు’ అనే కావ్యం రాశాడు.
కాకతీయుల యుగం
కాకతీయ రాజులు కళాపోషకులు. వీరి కాలంలో సంస్క్రుత తెలుగు భాషా సాహిత్యాలు వర్ధిల్లాయి. కాకతీ రుద్రదేవుడు సంస్క్రుతంలో ‘నీతిసారం’ రాశాడు. గణపతిదేవుడి కాలంలో ఉన్న జయాపసేనాని ‘న్రుత్యరత్నావళి’ రాశాడు. ప్రతాపరద్రుని ఆస్థానకవి విద్యానాథుడు ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ అనే గ్రంథం రాశాడు. ఆగస్త్యుడు బాలభారతం, క్రుష్ణచరితం వంటి 74 గ్రంథాలను రాశాడు. కాకతీయుల కాలంనాటి ప్రముఖ కవి పాల్కురికి సోమనాథుడు. ఈయన వీరశైవ కవి. వరంగల్ జిల్లాలోని పాల్కురి ఇతని జన్మస్థలం. సంస్క్రుత ఛందస్సును వదిలి ద్విపద ఛందస్సులో దేశీయ పదాలతో, జానుతెలుగులో రచనలు చేశాడు. బసవపురాణం, పండితారాధ్యచరిత్ర, వ్రుషాధిపశతకం మొదలైన గ్రంథాలను రచించాడు. గోనబుద్దారెడ్డి ‘రంగనాథ రామాయణం’  తొలి తెలుగు రామాయణం. ఈ కాలంలోనే అప్పయాచార్యులు అనే జైన కవి ‘జినెంద్ర కల్యాణాభ్యుదయం’ అనే గ్రంథం రాశాడు. వినుకొండ వల్లభరాయుని ‘క్రీడాభిరామం’, ఏకామ్రనాథుని ‘ప్రతాపచరిత్ర’, బద్దెన ‘నీతిశాస్త్ర ముక్తావళి’, కాసె సర్వప్పశెట్టి ‘సిద్దేశ్వరచరిత్ర’ ఈ కాలంనాటి ప్రసిద్ధ రచనలు.

***కుతుబ్ షాహీల యుగం***
కుతుబ్ షాహీలు స్థానిక ప్రజల  భాష తెలుగును ఆదరించారు. వీరు అన్యమతస్థులు అయినప్పటికీ తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి క్రుషిచేశారు. అనేక మంది తెలుగు కవులు, పండితులను వీరు పోషించారు. ముఖ్యంగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో గోల్కొండ దర్బార్ తెలుగు భాషా కవులకు పండితులకు భువనవిజయంగా మారింది. ఈ కాలంలో అద్దంకి గంగాధర కవి ‘తపతీ సంవరణోప్యాఖ్యానం’ రాసి ఇబ్రహీం కులీ కుతుబ్ షాకు అంకితం ఇచ్చాడు. ‘సుగ్రీవ విజయం’, ‘ నిరంకుశోపాఖ్యానం’ రాసిన కందుకూరి రుద్రకవి పాండిత్యానికి ప్రభావితుడైన ఇబ్రహీం అతనికి ‘చింతలపాలెం’ అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. పఠానుచెరువు ప్రాంతానికి అధికారిగా ఉన్న ఇబ్రహీం కులీ సర్దారు అమీన్ ఖాన్ కవులను ఆదరించారు. పొన్నిగంటి తెలగన తన ‘యయాతి చరిత్ర’ను అమీన్ ఖాన్ కు అంకితం ఇచ్చాడు. అచ్చతెలుగులో రాసిన మొట్టమొదటి గ్రంథం యయాతి చరిత్ర.

ఇబ్రహీం కుతుబ్ షా వారసుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానకవి గణేశ పండితుడు. ఈ కాలంనాటి మరో ప్రముఖకవి సారంగతమ్మయ్య. గోల్కోండ రెవెన్యూ అధికారిగా (కరణం)గా పనిచేసిన సారంగతమ్మయ్య ‘వైజయంతి విలాసం’ అనే గ్రంథం రాశాడు. క్రుష్ణా జిల్లా మువ్వకు చెందిన క్షేత్రయ్య అబ్దుల్లా కుతుబ్ షాకు సమకాలీకుడు. క్షేత్రయ్య గోల్కొండ ఆస్థానాన్ని సందర్శించి సుల్తాన్ పై వేయికి పైగా పదాలు పాడాడు. అబుల్ హసన్ తానీషా కాలంలో జటప్రోలు, గద్వాల సంస్థానాధీశులు తెలుగు కవులను పండితులను ఆదరించారు. ఖమ్మం ప్రాంతానికి సుల్తాన్ రెవెన్యూ అధికారిగా (తహసిల్దార్)గా విధులు నిర్వహించిన కంచర్ల గోపన్న భద్రాచాలంలో రామాలయాన్ని నిర్మించాడు. బందీఖానాలో ఉన్నప్పుడు  పాడిన రామ కీర్తనలు ప్రజాభిమానాన్ని పొందాయి. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా కీర్తి పొందాడు. ఆయన రచించిన ‘దాశరథి శతకం’ తెలుగు సాహిత్యంలో శాశ్వత కీర్తిని పొందింది. 

***అసఫ్ జాహీ యుగం***
అసఫ్ జాహీ రాజులలో మొదటి అసఫ్ జా నిజాముల్ ముల్క్, నాసర్ జంగ్, ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వయంగా కవులు. ఉర్దూ పారశీక భాషల్లో రచనలు చేశారు. అయితే వీరి కాలంలో సంస్థానాల్లోనే సాహిత్య పోషణ అధికంగా జరిగింది. అమరచింత సంస్థానంలో సురపురం కేశవయ్య ‘నిరోష్ఠ్య రామాయణం’, తిరుమల బుక్కపట్టణం రంగాచార్యులు ‘గుణ రత్నాకర’, ‘పద్మినీ పరిణయం’, శ్రీనివాసాచార్యులు ‘జాంబవతి పరిణయం’ మొదలైన రచనలు చేశారు. దోమకొండ సంస్థానంలో కామినేని మల్లారెడ్డి, ‘పద్మపురాణం’, ‘శివధర్మోత్తరం’, పట్టామెట్ట సోమనాథుని సోమయాజీ ‘సూత సంహిత’, పెద్దమందడి వెంకటక్రుష్ణ కవి ‘రెడ్డికుల నిర్ణయ చంద్రిక’ గ్రంథాలు రాశారు.
గద్వాల సంస్థానంలో ప్రతి సంవత్సరం కార్తీక మాఘ మాసాల్లో కవిపండితులను సన్మానించేవారు. గద్వాల సంస్థానాన్ని అభివ్రుద్ధి పరిచిన పెద్దసోమభూపాలుడు రామాయణాన్ని సంస్క్రుతం నుంచి తెలుగులోకి అనువదించడానికి ఎంతో మంది కవులను నియమించాడు. వారు రామాయణాన్ని సంపూర్ణంగా తెలుగులోకి అనువదించారు. ఈ కాలంలో.. పెద్ద సోమభూపాలుడు ‘రతి రహస్యం, అష్టపదులు, మదాలస ప్రబంధం’, కాణాదం పెద్దసోమయాజీ ‘ భద్రా పరిణయం’, ముకుంద విలాసం; పుల్లగుమ్మి వెంకటాచార్యులు ‘ఆదిలక్ష్మి కర్ణపూరం, ఆంధ్ర వ్యాకరణ సూత్రావళి, అలంకారావళి, వ్యాకరణ సూత్రావళి’ మొదలైన గ్రంథాలు రాశాడు. ‘జానకీ పరిణయం, రామ భూపాల విజయం’ రాసిన పురాణం నరసింహాచార్యులు తిరుపతి వేంకట కవులతో సాహిత్య పోటీలో పాల్గొన్నాడు. పెద్దమందడి వెంకట క్రుష్ణకవి ‘గద్వాల సంస్థాన’ చరిత్రను రాశాడు. గద్వాల సంస్థాన కవులు తిరుపతి వెంకటకవులు, కొప్పరపు కవులు, వేదం వేంకటరాయశాస్త్రి, కాశీ క్రుష్ణాచార్యులు, కారంపూడి రాజమన్నారుకవి మొదలైన అనేక మంది కవులను గౌరవించారు. చల్లపల్లి సుబ్యయ్య అనే సంగీత విద్వాంసుడు గద్వాల సంస్థానంలో ఉండేవాడు.
జటప్రోలు సంస్థానంలో మంచాలకట్ట గోవిందాచార్యులు, కవి కంఠీరవ క్రుష్ణమాచార్యులు ఉండేవారు. యాణయవల్లి క్రుష్ణమాచార్యులు ‘న్రుహింస విలాసం’, ‘జ్నాననందం’, వెల్లాల సదాశివశాస్త్రి ‘వెలుగోటివారి వంశావళి, సురభి వంశచరిత్ర’, రాజా వెంకటలక్ష్మిరాయ బహదూర్ ‘చంద్రికా పరిణయం నాటకం’, ‘సురభివంశచరిత్రర’ మొదలైన రచనలు చేశారు. ఈ సంస్థానాధీశులు క్రుష్ణా, గోలకొండ, సుధర్మ పత్రికలకు సంచాలకులుగా వ్యవహరించారు.
పాల్వంచ సంస్థానంలో ప్రముఖ కవి కొత్తపల్లి వెంకట లక్ష్మీనారాయణ శర్మ ‘పాల్వంచ సంస్థాన చరిత్ర’ను రచించారు.
వనపర్తి సంస్థానాధీశులు అనేక మంది కవులను, పండితులను ఆదరించి పోషించారు. రాజబహిరి గోపాలరాయ ఈ వంశంలో గొప్పకవి. ‘రామచంద్రోదయం’ రాశాడు. సామాన్య ప్రజానీకం ఇతన్ని ‘అష్ట భాష గోపాలరాయ’ అని పిలిచేవారు. సింగంపల్లి నరసింహ సిద్ధాంతి ‘భూభ్రమణ భ్రాంతి నిరసన’, అర్చకం అయ్యాచార్యులు ‘చెన్నకేశవ విలాసం’, ‘అలంకార మణిహారం’, ‘ఉన్మత్త్వ పాండవీయం’ మొదలైన గ్రంథాలు నూటికి పైగా రాశాడు. ఈయన శతాధిక గ్రంథ కర్త. నెమలూరి వెంకటశాస్త్రి, సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి, చెలమల్లి రంగాచార్యులు కూడా వనపర్తి సంస్థానంలో ఉండేవారు. వీరు వేదశాస్త్రంపై పరీక్షలు నిర్వహించేవారు. మానవల్లి రామక్రుష్ణకవి వనపర్తి సంస్థానంలో 12 సంవత్సరాలు గ్రంథ ప్రచురణ అధికారిగా పనిచేశారు.   

***తెలంగాణాలో సాంస్క్రుతిక, సాహిత్య చైతన్యం***
తెలంగాణాలో ఒద్దిరాజు సోదరులుగా పేరుపోందిన సీతారామచందర్ రావు, రాఘవ రంగారావులు 1920లో వరంగల్ జిల్లాలోని ఇనగుర్తి గ్రామం నుంచి ‘తెలుగు’ వార పత్రికను ప్రారంభించారు. నల్గొండ నుంచి షబ్నవీసు రామనరసింహారావు సంపాదకత్వంలో ‘నీలగిరి’ వార పత్రిక వెలువడింది. తెలుగులో వెలువడిన పత్రికల్లో దివవర్ధమానీ, సరోజినీ విలాస్, ఆంధ్రమఠ్, తెలుగు పత్రిక, ఆంధ్రాభ్యుదయం, నిజాం విజయ్ ముఖ్యమైనవి.
                                                  
తెలంగాణాలో పండితులు మేధావులు తెలుగు భాషకు సంస్ర్కుతికి ఎనలేని సేవ చేశారు. వీరిలో మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామక్రుష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి మొదలైనవారు ముఖ్యులు.
సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇంకా.. చంపకీ బ్రమర విషాదం, ప్రేమార్పణం అనే గీతాలు ప్రసిద్ధి పొందాయి. హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషణములు అనేవి ప్రసిద్ధ చారిత్రక పరిశోధన గ్రంథాలు. సురవరం వారు గొప్ప పాత్రికేయులు. 1925లో గోలకొండ పక్ష పత్రికను స్థాపించి సంపాదకత్వం వహించారు.
బూర్గుల రామక్రుష్ణరావు బహుముఖ ప్రజ్నాశాలి. సామాజిక, రాజకీయ, సాహిత్య రంగాల్లో విశేష క్రుషిచేశారు. తెలుగులో ‘పండిత రాజ పంచామ్రుతం, క్రుష్ణశతకం అనే గ్రంథాలు రాశారు. వానమామలై వరదాచార్యులు అభినవ పోతనగా కీర్తి గడించాడు ‘పోతన చరిత్ర’, ‘విప్రలబ్ధ’ గ్రంథాలు రాశాడు. మాడపాటి హనుమంతరావు ‘తెలంగాణాలో ఆంధ్రోద్యమము’ అనే గ్రంథం రాశాడు. పివి నరసింహారావు బహుభాషావేత్త. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘వేయిపడగలు’ నవలను ‘సహస్రఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించారు.
కాళోజీనారాయణరావు, దేవులపల్లిరామానుజరావు, ఇల్లిందుల సరస్వతీదేవి మొదలైనవారు ప్రముఖ రచయితలు.

తెలుగు భాషా సాహిత్యాల అభివ్రుద్ధికోసం హైదరాబాద్ లో 1943లో ఆంధ్ర సారస్వత పరిషత్తును ప్రారంభించారు. లోకనంది శంకరనారాయణ మొదటి అధ్యక్షులు. బూర్గుల రంగనాథరావు భాస్కరభట్ల క్రుష్ణారావులు దీని కార్యదర్శులు. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, కోదాటి నారాయణరావు, పులిజాల హన్మంతరావు, దేవులపల్లి రామానుజరావు, ఆదిరాజు వీరభద్రరావు పరిషత్తు కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు.
సాహితీవేత్తలలో దాశరథి క్రుష్ణమాచార్యులకు ప్రధాన స్థానం ఉంది. అగ్నిధార, రుద్రవీణ మొదలైన సంపుటాలను రాశాడు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే నినాదం చాలా ప్రాచుర్యం పొందింది. ఈయన సోదరుడు దాశరథి రంగాచార్య కూడా గొప్ప రచయిత. చిల్లరదేవుళ్లు, జనపదం వంటి నవలలు తెలంగాణ చరితకు అద్దంపడుతున్నాయి. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు (అసంపూర్తి) నవలలు రాశారు.

1901లో హైదరాబాద్ లో శ్రీక్రుష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. తెలంగాణాలో మొదటి తెలుగు గ్రంథాలయం. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, నాయని వెంకటరంగారావుల క్రుషివల్ల ఇది స్థాపించబడింది.
1904లో హనుమకొండ శ్రీ రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపించబడింది.
1905లో సికింద్రాబాద్ లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం వెలిసింది.

***తెలంగాణ పోరాట సాహిత్యం***
వట్టికోట ఆళ్వారుస్వామి, మహీధరరామ్మోహన్ రావు, బొల్లిముంత శివరామక్రుష్ణ, లక్ష్మీకాంతమోహన్, దాశరథి రంగాచార్య మొదలైనవారు తెలంగాణ పోరాట నవలలు రచించారు. వట్టికోట ప్రజలమనిషి, గంగు నవలలు, మహీధరరామ్మోహన్ రావు ‘ఓనమాలు’, ‘మ్రుత్యువునీడల్లో’, బొల్లిముంత శివరామక్రుష్ణ ‘మ్రుత్యుంజయులు’ నవలలు రాశారు. 1970 తర్వాత దాశరథి రంగాచార్య చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపదం, గొల్లపూడి నారాయణరావు ‘తెలుగుగడ్డ’ వెలువడ్డాయి.

తెలంగాణ విమోచన తర్వాత ప్రత్యేక తెలంగాణోద్యమం 1969, మలిదశ ఉద్యమాలతో పాటు ఆ కాలంలో వచ్చిన విప్లవ, దిగంబర, స్త్రీ, దళిత, మైనార్టీవాద సాహిత్యాన్ని అభ్యర్థులు చదవాల్సి ఉంటుంది.  

No comments:

Post a Comment